TS Ministers on Agnipath: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించడం, కొందరు గాయపడడం బాధాకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మృతుని కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు. 46 వేల మంది 90 రోజుల్లో నియామకం, కేవలం 30 వేల రూపాయల జీతం అర్థం లేనిదని, దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకం అని ఆక్షేపించారు. కేంద్ర నిర్ణయంపై యువత ఆగ్రహిస్తే తెరాసపై ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ గొడవలు జరుగుతున్నాయని అక్కడ ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించారు.
'దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు. దేశ భవిష్యత్, రక్షణకు ఇది గొడ్డలిపెట్టు. వేతనాలు, ఫించన్ల భారం తగ్గించుకోవడానికి కేంద్రం తీసుకున్న తలాతోకాలేని నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రమే బాధ్యత వహించాలి.' -నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
అగ్నిపథ్‌ను ఉపసంహరించాలి: భాజపా పాపం ముదిరి పాకానపడిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారని.. నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. నల్లధనం తెస్తాం... 15 లక్షల రూపాయలు పేదల ఖాతాల్లో వేస్తామని అమాయకుల ఓట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరు కింద అమ్మేస్తూ... నిరుద్యోగాన్ని 5.6 % నుంచి 7.83 % పెంచేశారని తూర్పారపట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయని... యువత ఆగ్రహం గమనించైనా కేంద్రం తన నిర్ణయాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.