తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నర్సింహారావు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రజ్ఞ అమోఘమని కీర్తించారు. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టిన మహనీయుడని పేర్కొన్నారు.
పీవీ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. పీవీ గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు అని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డైన పీవీ.. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని గుర్తు చేసుకున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీవీ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేసి, పారిశ్రామిక రంగంలో, పల్లెల స్థితిగతుల్లో సమూలంగా మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఏడాదిపాటు సాగిన పీవీ ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై నేడు జ్ఞానభూమిలో నిర్వహించే కార్యక్రమాలతో ముగింపు పలకనున్నారు. పీవీ సమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. పీవీ ఘనతపై రూపొందించిన 9 పుస్తకాలను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు.