కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో.. ప్రజలకు, కరోనా రోగులకు వారి కుటుంబాలకు అండగా నిలిచిన వారియర్స్‌ను తెలంగాణ సర్కార్ సత్కరించింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో కరోనా వారియర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Telangana Minister KTR), బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Bollywood actor sonu sood), తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ కొవిడ్ వారియర్లను పురస్కారాలతో సన్మానించారు.
కేటీఆర్ లాంటి నేతలుంటే.. తనలాంటి వాళ్ల అవసరం ఉండదని బాలీవుడ్ నటుడు సోనూసూద్(Bollywood actor sonu sood) అన్నారు. కరోనా సమయంలో జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానన్న సోనూ.. తెలంగాణ నుంచి మాత్రమే ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని తెలిపారు. అందువల్లే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉందన్నారు. ఆ మహమ్మారి నుంచి రాష్ట్రం, ప్రజలు త్వరగా కోలుకున్నారంటే అది కేటీఆర్ లాంటి సమర్థ నాయకులు తెలంగాణలో ఉండటం వల్లేనని సోనూసూద్(Bollywood actor sonu sood) ఉద్ఘాటించారు.
"కొవిడ్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారు. బాధితులకు సహాయపడటమే మన ముందున్న సవాలు. కరోనా మొదటి, రెండు దశలు సృష్టించిన విలయం నుంచి బయటపడటమే ప్రస్తుతం మన ముందున్న ఛాలెంజ్. కొవిడ్ సమయంలో నేను చాలా మందికి సాయం చేశాను. ఆ టైంలో చాలా మంది నన్ను నిరుత్సాహపరిచారు. ఏదో కారణంతో నేను ఆ పనిచేస్తున్నానని అన్నారు. ఎవరైనా మంచి పని చేసేటప్పుడు.. ఆపడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు వాళ్లకి భయపడి ఆ పని ఆపొద్దు. మీ సాయం కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. వాళ్లకి సాయం చేయడమే మీ జీవితపరమార్థం అవ్వొచ్చు. అందుకే ఎవరికైనా సాయం చేసేటప్పుడు.. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంత మంది నిరుత్సాహపరిచినా వెనకడుగువేయొద్దు."