Telangana New Secretariat Construction : సచివాలయ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం మొత్తాన్ని పరిశీలించిన ఆయన.. అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్టులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ప్రణాళిక ప్రకారం పనులు..
Telangana New Secretariat Building : పనులు జరుగుతున్న తీరును మంత్రి వేములకు అధికారులు, గుత్తేదార్లు వివరించారు. బ్లాకుల వారీగా నిర్మాణ పురోగతిని వివరించిన వారు.. మొత్తం ఎనిమిది స్లాబులకు గాను ముందు వైపు ఆరు, వెనకవైపు ఏడు స్లాబులు పూర్తైనట్లు చెప్పారు. వర్క్ చార్ట్ ప్రకారం జరుగుతున్న పనుల వివరాలను మంత్రికి తెలిపారు.
గడువులోగా పూర్తవ్వాలి..
Minister Prashant At New Secretariat : పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అంతస్తుల వారీగా ప్రణాళికలు పరిశీలించిన ఆయన.. అంతర్గత నిర్మాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జరగాలని సూచించారు. గుత్తేదారు, అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రులు, అధికారుల ఛాంబర్లు, శాఖల వారీగా విభాగాలు, అంతర్గత నిర్మాణాలపై కూలంకషంగా సమీక్షించారు. అంతర్గత పనుల్లోనూ వేగం పెంచాలన్న మంత్రి.. పనులన్నీ సమాంతరంగా జరగాలని చెప్పారు. దేవాలయం, మసీదు, చర్చిల నిర్మాణాలు జరిగే స్థలాలు, ప్రణాళికలను పరిశీలించిన మంత్రి.. ప్రార్థనా మందిరాల నిర్మాణాలు కూడా త్వరగా ప్రారంభించాలన్నారు. సచివాలయ నిర్మాణ పనులు, పురోగతిని విధిగా నిత్యం తనిఖీ చేస్తానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.