Harish Rao Birthday : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రమంతటా అభిమానులున్నారు. ఆయన పుట్టిన రోజును పండుగలా జరుపుకునే వారూ ఉన్నారు. ప్రతి ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా హరీశ్ రావు నివాసానికి ఫ్యాన్స్, తెరాస కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వేడుకలు చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం తన పుట్టిన రోజున మిత్రులు, అభిమానులు, కార్యకర్తలెవరూ సిద్దిపేట, హైదరాబాద్‌కు రావొద్దని ట్విటర్ ద్వారా కోరారు. ఎందుకంటే..?
Harish Rao Birthday
By
Published : Jun 3, 2022, 7:11 AM IST
|
Updated : Jun 3, 2022, 1:50 PM IST
తిరుమలేశుడి సేవలో మంత్రి హరీశ్ రావు
Harish Rao Birthday : నేడు.. తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు. సాధారణంగా నాయకుల జన్మదినం అంటే.. అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటుంటారు. ఉదయాన్నే తమ ప్రియతమ నాయకుడి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. హరీశ్ రావు అభిమానులు కూడా ప్రతి ఏడాది ఆయన నివాసానికి వెళ్లి పుట్టిన రోజు విషెస్ చెప్పి.. వేడుకలు జరుపుతుంటారు.
Harish Rao Visited Tirumala : హరీశ్ రావు కూడా వాళ్లందర్ని సాదరంగా ఆహ్వానిస్తారు. వారి అభిమానానికి దాసోహమవుతారు. కానీ ఈ ఏడాది తన పుట్టిన రోజున మిత్రులు, అభిమానులెవరూ హైదరాబాద్ గాని, సిద్దిపేటకుగానీ రావొద్దని వైద్యఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్‌రావు గురువారం ట్విటర్ ద్వారా కోరారు. తనపై ఉన్న ప్రేమాభిమానాలను సేవా కార్యక్రమాల ద్వారా చాటాలన్నారు. తనకు సందేశం పంపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన హైదరాబాద్, సిద్దిపేటలో లేనందునే అభిమానులు, కార్యకర్తలను తన ఇంటి వద్దకు రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అలిపిరి నుంచి కాలినడకన గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద ఆయనకు తితిదే డిప్యూటీ ఈవో ఆర్1 హరీంద్రనాథ్ పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. అనంతరం బస ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం తలనీలాలు సమర్పించుకుని.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరోవైపు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్ రావు తెలంగాణలో లేకపోయినా.. పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయన అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు.