దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఖ్యాతి, సీఎం కేసీఆర్ కృషిని దశదిశలా వ్యాప్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. రాష్ట్రంలోని పథకాలకు దేశవ్యాప్తంగా ప్రచారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక మాసపత్రిక యోజన నవంబర్ ప్రత్యేక సంచికను హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎర్రబెల్లి ఆవిష్కరించారు.
అభివృద్ధి, సంక్షేమ పత్రికగా దేశంలో 'యోజన'కు మంచి పేరుందని ఎర్రబెల్లి కితాబిచ్చారు. సివిల్ సర్వీసులకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ పత్రిక మంచి సమాచార వాహికగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. యోజన పత్రిక నవంబర్ సంచికను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించడం సంతోషకరమన్నారు. పత్రికలోని మొత్తం 72 పేజీల్లో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గురించే రాశారని మంత్రి తెలిపారు.