గనుల రంగం నుంచి పన్నులు, సెస్‌లు, లీజుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం సమకూరుతుంది. లాక్‌డౌన్ వల్ల గనుల తవ్వకాలు నిలిచిపోవడం, ఖనిజాల అమ్మకాలు తగ్గడం వల్ల ఈ ఆదాయానికి చాలా మేరకు గండిపడింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేరకు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.5,000 కోట్ల వరకు ఆదాయ నష్టం ఉంటుందని కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ అంచనా వేసింది.
కొన్ని కొత్త బొగ్గు గనులు, ఇతర గనుల వేలం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వేలం సాధ్యం కాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ఇటీవల కొన్ని ఇనుప ఖనిజం గనులను ప్రభుత్వం వేలం ద్వారా కొన్ని సంస్థలకు కేటాయించింది. ఆయా సంస్థలు తవ్వకాలు ప్రారంభించలేని స్థితిలో ఉన్నాయి. స్టీలు, సిమెంటు, విద్యుత్తు రంగ సంస్థల నుంచి ఇనుప ఖనిజానికి డిమాండ్ తగినంతగా కనిపించడం లేదు. గనుల తవ్వకాలు- నిర్వహణ పనులు చేపట్టే సంస్థలకూ ఆదాయ నష్టం అధికంగా ఉంటుంది. అందువల్ల ఆయా సంస్థలు తమ బాకీలను వెంటనే చెల్లించలేకపోవచ్చు. కార్మికుల కొరత ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో గనుల తవ్వకాలు చేపట్టలేని పరిస్థితి ఉంది.గనుల ఆదాయం ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికం.
బొగ్గు వినియోగం తగ్గింది...
కొవిడ్- 19 లాక్‌డౌన్ వల్ల పారిశ్రామిక కార్యకలాపాలు మందగించి, బొగ్గు వినియోగం తగ్గింది. ఈ ఏడాది మార్చిలోనే బొగ్గు వినియోగం 16 శాతం వ్యతిరేక వృద్ధి నమోదు చేసింది. ఇదే పరిస్థితి మరిన్ని నెలల పాటు కనిపిస్తుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు నెలలుగా పనులు లేక నిర్మాణ రంగంలో వినియోగించే ఇతర ఖనిజాల వినియోగం సైతం బాగా క్షీణించింది. దీనికి తోడు కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి వచ్చేది ఎప్పుడో. ఫలితంగా కంకర, గ్రావెల్, ఇసుక వినియోగం కూడా తగ్గిపోయింది.