తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు ప్రారంభం - Telangana Medical colleges will start from February

తెలంగాణలో కరోనా వ్యాప్తితో మూతపడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ప్రభుత్వం పచ్చాజెండా ఊపింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Medical colleges will start from February first after covid lock down
రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు ప్రారంభం

By

Published : Jan 28, 2021, 7:23 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలను వచ్చే నెల 1 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ కారణంగా గత తొమ్మిది నెలలుగా మూసివేసిన కళాశాలలు తిరిగి తెరవడానికి సర్కారు అనుమతించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 29న గవర్నర్‌ తమిళిసై సమక్షంలో అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం ఉండడంతో అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 31న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల ప్రధానాచార్యులతో ఆరోగ్యవర్సిటీ, వైద్యవిద్య సంచాలకులు దృశ్య మాధ్యమంలో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని కళాశాలల ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ముందుగా తొలి ఏడాది (2019-20లో ప్రవేశాల పొందిన) విద్యార్థులకు, తుది సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.

తరగతుల నిర్వహణ ఇలా.. వివరాలు :

ఒకేసారి ఎక్కువమంది విద్యార్థులు హాజరవకుండా ఉండేందుకు, ప్రాక్టికల్స్‌ కోసం ఒక తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఉస్మానియా వైద్యకళాశాలలో 250 మంది విద్యార్థులుంటే 125 చొప్పున వేరు చేస్తారు.

సగం బ్యాచ్‌కు 15 రోజులు, మిగిలిన సగం బ్యాచ్‌కు మరో 15 రోజుల చొప్పున నెల రోజులను సర్దుబాటు చేస్తారు.

ఈ సగం బ్యాచ్‌లోనూ మళ్లీ రెండుగా విభజించి, కొందరు విద్యార్థులకు ఉదయం 9-12 గంటల వరకూ ఒకరికి, మధ్యాహ్నం 12-3 గంటల వరకూ మరికొందరికి ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

ఎంబీబీఎస్‌తోపాటు దంత, నర్సింగ్‌ విద్యార్థులకు కూడా ఇదే విధంగా నిర్వహణ ప్రణాళిక రూపొందించారు.

తొలి ఏడాది (2020-21లో ప్రవేశాలు పొందిన బ్యాచ్‌), చివరి ఏడాది మినహా అన్ని తరగతుల విద్యార్థులకూ మరో మూణ్నాలుగు నెలల వరకూ థియరీ తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. థియరీ తరగతులను కూడా 15 రోజులకు ఒక బ్యాచ్‌కు, మరో 15 రోజులకు మరో బ్యాచ్‌కు నిర్వహించాలని ఆరోగ్యవర్సిటీ యోచిస్తోంది.

ప్రాక్టికల్స్‌ నిర్వహణలో తొలి ఏడాది(2019-20) విద్యార్థులకు అమలు చేస్తున్న విధానాన్ని ఒక నెల పాటు పరిశీలించిన అనంతరం లోటుపాట్లను గమనించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

2020-21 సంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ముందుగా ఓరియెంటేషన్‌ తరగతులను ఆన్‌లైన్‌లో నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ తర్వాత థియరీ తరగతులు కూడా ఆన్‌లైన్‌లోనే కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశాలున్నాయి.

2019-20 సంవత్సరంలో చేరిన తొలి ఏడాది విద్యార్థులకు ఇప్పటికే థియరీ పరీక్షలు పూర్తికాగా, ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీటిని వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌ మాసాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలకు సన్నద్ధంగా ఉండాలని కాళోజీ ఆరోగ్యవర్సిటీ లేఖలు రాసి ఉండడంతో.. వైద్యకళాశాలలన్నీ కూడా ఆ మేరకు సంసిద్ధంగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details