Telangana Liberation Day Celebrations: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాతనే సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణకు పూనుకున్నారని రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా.. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించారు.
అనంతరం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిపాటు ప్రజలు ఎంతో నరకయాతన అనుభవించి, భరించారని తెలిపారు. ఆనాడు తెలంగాణ మహిళలపై నిజాం సంస్థానం చేసిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవని ఆయన వాపోయారు. తరవాత నాటి భారతదేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోను ప్రారంభిస్తే, 17వ తేదీన ప్రజలకు విముక్తి లభించిందని, దీన్నే తెలంగాణ విమోచన దినోత్సవంగా నేడు జరుపుకుంటున్నామన్నారు. ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో మహానుభావులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వీరి అందరి త్యాగాల ఫలితమే నేడు ఈ తెలంగాణ అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దారుసలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని ప్రకటించిందని ఆరోపించారు. హైదరాబాద్లోని మల్కాజిగిరిలో ఉన్న హాస్టళ్లలో పాచిపోయిన అన్నం పెడుతున్నారని, ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.