ఆర్ఎంసీ సిఫారసుల ముసాయిదాపై తెలంగాణ అభ్యంతరం
17:03 August 30
ఏపీ అభిప్రాయాలు పొందుపరిచి తమవి పక్కనపెట్టడం సరికాదని వెల్లడి
Telangana Letter to KRMB: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ సిఫారసుల ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ అభిప్రాయాలను ముసాయిదాలో పొందుపర్చలేదని అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు, ఆర్ఎంసీ కన్వీనర్‌కు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ముసాయిదా నివేదిక, సిఫారసుల్లో తెలంగాణ ప్రతిపాదనలను పొందుపరచలేదని లేఖలో పేర్కొన్నారు. ఏపీ అభిప్రాయాలను పొందుపరచి తమ అభిప్రాయాలు పక్కన పెట్టడం సబబు కాదని అన్నారు.
అభిప్రాయాలు పొందుపరచకుండా ఆర్ఎంసీ సమావేశానికి రావడంలో అర్థం లేదని ఈఎన్సీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రతిపాదనలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, రూల్ కర్వ్స్, వరద జలాల వినియోగానికి సంబంధించి తమ అభిప్రాయాలు పొందుపరచలేదని లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు. ఆర్ఎంసీ ఐదో సమావేశానికి ముందే తమ అభిప్రాయాలను పొందుపరచాలన్న రాష్ట్ర సర్కారు.. ఆ మేరకు ముసాయిదాను సవరించాలని కోరింది.
ఇవీ చూడండి: