తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజకీయ విమర్శలొద్దు.. అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. - pothireddypadu issue

పోతిరెడ్డిపాడు అంశంపై రాష్ట్రంలో పోరు ఉద్ధృతమవుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార, విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆ ప్రాజెక్టును ఎలాగైన అడ్డుకుంటామని మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. దిల్లీకి తీసుకెళ్లాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడులో జగన్ తట్ట మట్టి ఎత్తినా... కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం అన్నారు.

pothireddypadu
pothireddypadu

By

Published : May 15, 2020, 11:19 PM IST

పోతిరెడ్డిపాడు విషయంలో రాజకీయ విమర్శలకు దిగకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి హితవు పలికారు. తెరాసపై విమర్శలు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు.. వారి అధిష్ఠానాలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు అన్ని పార్టీలు ఏకం కావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. వాళ్లు కింద తవ్వితే మనకు పైన తవ్వుకునే అవకాశం ఉందని.. ఎత్తుకు పై ఎత్తు వేసి అడ్డుకుంటామని అన్నారు.

ఒక్క కేసైనా వేశారా?

కాంగ్రెస్, భాజపాలకు చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వారి అధిష్ఠానాల నుంచి ప్రధాని మోదీకి వినతిపత్రం ఇప్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రలో అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డుపాడును ఆనాడు అడ్డుకోకుండా హరతులు పట్టిన వాళ్లే నేడు తెరాసపై విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. స్వరాష్ట్రంలో ప్రాజెక్టులపై కేసులు వేసిన నాయకులు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఒక్క కేసైనా వేశారా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును ఎన్ని వేదికల ద్వారా.. ఎలా అడ్డుకోవాలో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అఖిలపక్షం ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన 203 జీవో అమలైతే శ్రీశైలం రిజర్వాయర్‌ నెల రోజుల్లోపు ఖాళీ అవుతుందని అఖిలపక్ష నేతలు తెలిపారు. కృష్ణానదీ జలాల వాటా పరిరక్షణ, తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష పార్టీల నేతలు కోదండరాం, చాడ వెంకట్‌ రెడ్డి, రమ, అచ్యుతరామారావు జలసౌధలో ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ మురళీధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు.

203 జీవో వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ జీవో ఉపసంహారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కృష్ణానదిపైన ఉన్న ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. అవసరమైతే ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. కృష్ణానదీ జలాలు పరిరక్షించకపోతే భవిష్యత్‌ తరాలకు అన్యాయం చేసిన వాళ్లం అవుతామన్నారు.

కేసీఆర్ మాట్లాడకపోవడం బాధకరం

పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు కుమ్మక్కు అయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. ఇందుకు అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలే సాక్ష్యం అంటూ... వీడియోను ప్రదర్శించారు. జగన్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని, కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు సీఎంగా చేసింది ఇందుకేనా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడులో జగన్ తట్ట మట్టి ఎత్తినా... కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 203 జీవో రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. ఏపీ నిర్ణయంపై సీఎం కేసీఆర్​ మాట్లడకపోవడం బాధకరమని అన్నారు. ఏపీ నిర్ణయంపై త్వరలోనే ప్రధాని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలుస్తానని వెల్లడించారు.

రాజకీయ విమర్శలొద్దు.. అఖిలపక్షం ఏర్పాటు చేయండి..

ABOUT THE AUTHOR

...view details