తెలంగాణ

telangana

ETV Bharat / city

అవరోధాలు అధిగమించి.. అనుకున్నది సాధించి.. - telangana kickboxer shiva sai kumar

కాలం విలువైనది... దానిని ఎలా వాడుకుంటే.. అలాంటి ఫలితాల్నే ఇస్తుంది. మన ఆశల్ని, ఆశయాలు సాధించేందుకు తోడ్పడుతుంది. చిన్నతనం నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరిచి ఇప్పుడు కిక్‌బాక్సింగ్‌లో పతకాల వేట సాగిస్తున్న శివసాయి కుమార్‌ విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల మధ్యనే... ఏదైనా సాధించాలనే తపనతోకిక్‌ బాక్సింగ్‌లో అతడు చేస్తున్న పోరాటం.. ఎవరినైనా ఆశ్చర్యపరచక మానదు.

telangana kickboxer shiva sai kumar about his journey and struggle
అవరోధాలు అధిగమించి.. అనుకున్నది సాధించాడు!

By

Published : Mar 12, 2021, 10:51 AM IST

కిక్‌ బాక్సింగ్‌, తైక్వాండో, కరాటే అన్నింటిలో ప్రతిభ చూపుతున్న ఈ కుర్రాడు.. చిలువేరి శివసాయి కుమార్‌. హైదరాబాద్‌లోని, కాచిగూడ స్వస్థలం. ఎవరైనా... ఏదో ఒక్క క్రీడలో నైపుణ్యం సాధిస్తారు. ఇతడు మాత్రం 3 మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం సాధించాడు.

అవరోధాలు అధిగమించి.. అనుకున్నది సాధించాడు!

శివది సామాన్య కుటుంబ నేపథ్యం. తండ్రి ఓ క్లబ్‌లో.. తల్లీ బ్యూటీషన్‌గా పని చేస్తున్నారు. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు తనే.ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ మధ్యలోనే ఆపేశాడు. ఖర్చులకు ఇంట్లో వాళ్లపై ఆధారపడడం ఇష్టం లేక ట్యూషన్లు చెబుతూ. కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు . తనకిష్టమైన మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు.

ఎన్ని కష్టాలు ఎదురైనా... చదువును నిర్లక్ష్యం చేయుకూడదని ఇంటర్‌ పూర్తి చేశాడు శివ. ఆపై... హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరాడు. ఇదే క్రమంలో కిక్‌ బాక్సింగ్‌లోనూ మెరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టపడే శివ.... ఎన్​సీసీ స్ఫూర్తితో మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు మళ్లాడు.

పాఠశాలస్థాయి నుంచే కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌, తైక్వాండా నేర్చుకున్నాడు. పలు విభాగాల్లో పతకాలు సాధించాడు. తర్వాత కిక్‌ బాక్సింగ్‌ వైపు ఆకర్షితుడై నాలుగేళ్లుగా అబ్దుల్‌ సత్తార్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో... కొద్ది సమయంలో మంచి నైపుణ్యాలు సొంతం చేసుకున్నాడు.

వాకో ఇండియా ఫెడరేషన్‌ కప్‌-2020 జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాడు శివకుమార్‌. ఈ పోటీల్లో సాప్ట్‌స్టైల్‌ వెపన్‌ సీనియర్‌ 79 కిలోల విభాగంలో.. బంగారు పతకం గెలుపొందాడు. దక్షిణ కొరియాలో జరగనున్న ఏషియన్‌ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

ఇప్పటి వరకు జాతీయస్థాయిలో 10స్వర్ణాలు గెలుచుకున్న శివసాయి... 7సార్లు రజతం, 5 సార్లు కాంస్య పతకాలు సాధించాడు. చిన్నప్పటి నుంచి కాలాన్ని వృథా చేయకుండా.. క్రమశిక్షణతో మెలిగడం వల్లే ఈ స్థాయి విజయం సొంతం చేసుకున్నాడని ప్రశంసిస్తున్నారు...అతని గురించి తెలసిన వాళ్లు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు దూసుకుపోతున్న శివసాయి... కిక్‌ బాక్సింగ్‌లో మరింత సాధించాలని కలలు కంటున్నాడు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు చదువుల్లో ప్రతిభ చూపుతున్నాడు. ఖాళీ సమయాల్లో జిమ్‌లోనూ పనిచేస్తూ... ఖర్చులకు సంపాదించుకుంటున్నాడు.

ఎలాగైనా అంతర్జాతయ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కానీ... ప్రపంచ పోటీలంటే అదే స్థాయిలో శిక్షణ అవసరమంటున్న శివసాయి.... అందుకు భారీగా ఖర్చుపెట్టాలని చెబుతున్నాడు. తన ఆర్థిక స్థితి సరిగా లేదని.... ఎవరైనా దాతలు, ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాడు.

ఇష్టంగా మొదలుపెట్టిన ఏ పనిలోనైనా పూర్తి నైపుణ్యాలు సాధించేందుకు.... శివసాయి చూపుతున్నమొండిపట్టుదల ఎందరో ప్రశంసలు అందుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details