KTR at World Economic Forum : సౌరవిద్యుత్ రంగంలో తెలంగాణ వేగంగా పురోగమిస్తోందని, దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం ఉన్న రాష్ట్రం 4.2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 10.30 శాతం ఉత్పత్తి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. మరో ఏడాదిలో రాష్ట్రం సుమారు ఆరు గిగావాట్ల స్థాయికి చేరుతుందన్నారు. గురువారం.. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) తొమ్మిదో ప్రాంతీయ కార్యాచరణ బృందం దృశ్యమాధ్యమంలో నిర్వహించిన సదస్సులో ఆయన హైదరాబాద్ నుంచి ప్రసంగించారు.
చేయూత ఇవ్వాలి..
KTR About Solar Energy :‘‘ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నారు. లక్ష్యసాధనకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి. తెలంగాణ కొత్త విధానాలతో కర్బన ఇంధనాలను తగ్గించడంతో పాటు హరితహారం చేపట్టి ఫలితాలను సాధిస్తోంది. డ్రోన్ల ద్వారా విత్తనాలను చల్లుతూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణకు ఆవిష్కరణలు, అంకురాలకు చేయూతనివ్వాలి. హరిత పరిష్కారాల కోసం విద్యారంగంలో మార్పులు చేయాలి’’.