తెలంగాణ

telangana

ETV Bharat / city

'రుణాల విషయంలో తెలంగాణ నియంత్రణలోనే ఉంది' - తెలంగాణ అప్పులు

Telangana Debts : వివిధ రూపాల్లో రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై కేంద్రం దృష్టి పెట్టిన వేళ... తాము పరిధిలోనే ఉన్నామంటూ కేంద్రానికి రాష్ట్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన మేరకు వివరాలు అందించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం తీసుకుంటున్న రుణాలు... కేంద్రం నిర్దేశించిన విధానాల పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Telangana Debts
Telangana Debts

By

Published : Apr 30, 2022, 9:23 AM IST

Telangana Debts : రాష్ట్రాల అప్పులపై కేంద్రం నజర్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల చిట్టాను సిద్ధం చేసి పంపింది. కొన్ని రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ ఆర్థికంగా నియంత్రణ కోల్పోతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాల నుంచి అప్పులపై పూర్తి వివరాలను కోరింది. దీంతోపాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్‌ రుణాలను సమీకరించుకోడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం రాష్ట్రాల నుంచి వివిధ వివరాలను కోరింది.

Telangana Loans : ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి వివరాలను అందచేసినట్లు సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్‌ రుణాలు, ప్రభుత్వ పూచీకత్తు రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలనుంచి తీసుకున్న రుణాలు, పీఎఫ్‌, జీపీఎఫ్‌ సహా వివిధ వివరాలను అందచేసింది. ఇవన్నీ కేంద్రం నిర్దేశించిన విధానాల పరిధిలోనే ఉన్నాయని వివరించింది. దీంతోపాటు తక్కువ వడ్డీతో పాటు దీర్ఘకాలిక మెచ్యూరిటీ ప్రాతిపదికన బాండ్లను విక్రయించేందుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులను పెంచుకుంటూ రాబడులను పెంచుకుంటోందని... తీసుకున్న రుణాలను అభివృద్ధి పనులకే వ్యయం చేస్తోందని పేర్కొంది. ఈ విషయాలన్నీ కాగ్‌ కూడా నివేదికలో పేర్కొన్న అంశాన్నీ వివరించింది.

Telangana About Debts : 2022 మార్చి ఆఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు సంబంధించిన పూర్తి గణాంకాలను, రుణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ఆర్థికశాఖ అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రుణాల కోసం విక్రయించిన బాండ్లు ఏడేళ్లలోపు మెచ్యూరిటీ అయ్యేవి 39 శాతం మాత్రమే అని పేర్కొరు. దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికగా బాండ్లను విక్రయించడం ద్వారా వెంటనే చెల్లింపులు చేయాల్సిన అవసరంలేకుండా పోయిందని దీంతోపాటు రాష్ట్ర అభివృద్ధి రుణాల ద్వారా అప్పటిలోపు అభివృద్ధి ఫలాలు అందుతాయని వివరించినట్లు సమాచారం. రుణాల చెల్లింపుకు రాష్ట్రం ప్రణాళికలను తెలియచేశారు. బడ్జెట్‌ పరిధిలో తెలంగాణ రాష్ట్ర రుణాలు, చెల్లించాల్సినవి రూ.3,12,191 కోట్లు కాగా ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.1,05,006 కోట్లుగా వివరించినట్లు తెలిసింది.

ఏప్రిల్‌లో రూ.3000 కోట్ల బాండ్లకు బ్రేక్‌ :కేంద్ర అనుమతి లేకపోవడంతో ఏప్రిల్‌ నెలలో రూ.3000 కోట్ల బాండ్లను విక్రయించాలనుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలు కార్యరూపందాల్చలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల రాష్ట్ర అభివృద్ధి నిధులను బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మొదటి త్రైమాసికంలో రూ.15వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని... ఇందులో ఏప్రిల్‌లో రూ.3000 కోట్లు, మేలో రూ.8000, జూన్‌లో మరో రూ.4000 కోట్లు మార్కెట్‌ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. తాజాగా ఏప్రిల్‌ నెల ముగుస్తున్నా బాండ్ల విక్రయం కాకపోవడంతో రాష్ట్ర అవసరాలపై కూడా రుణాలు పొందలేకపోవడం ప్రభావం పడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రానున్న నెలల్లో అంచనాలకంటే ఎక్కువ మొత్తంలో రుణాలను సమీకరించుకోవాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details