తెలంగాణ

telangana

ETV Bharat / city

'తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ' - హరీష్​రావు వార్తలు

Telangana Vaccination : రాష్ట్రంలో 15 నుంచి 18 వయసుల వారికి జనవరి 3 నుంచి కొవిడ్ టీకా అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. తెలంగాణలో మొదటి డోసు టీకా పంపిణీ వంద శాతం పూర్తయిన సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్న ఆయన... కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా దేశంలోని ఏ ఒక్క పెద్ద రాష్ట్రం ఈ ఘనత సాధించలేదన్నారు. వైద్య సిబ్బందిన నిర్విరామ కృషికి ఇది నిదర్శనమన్నారు.

Telangana Vaccination
Telangana Vaccination

By

Published : Dec 28, 2021, 6:57 PM IST

Updated : Dec 28, 2021, 9:52 PM IST

Telangana Vaccination : రాష్ట్రంలో కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి అయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. వంద శాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా నియమించిన టీకా పంపిణీ బృందాల నిర్విరామ కృషి వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీకా ప్రారంభ సమయంలో 2011 జనాభా దృష్టిలో పెట్టుకుని కేంద్రం 2 కోట్ల 77 లక్షల డోసులు ఇచ్చిందని... టీకా కొరత ఉన్నప్పుడు వైద్య శాఖ ఉన్నతాధికారులు చురుగ్గా వ్యవహరించి ఆ లక్ష్యాన్ని చేరుకున్నారని వివరించారు. తెలంగాణలో రెండో డోసు 66.1 శాతం పూర్తయిందని తెలిపారు. మొదటి డోసు జాతీయ సగటు 90 శాతం ఉండగా.. తెలంగాణ 100శాతం, రెండో డోసు జాతీయ సగటు 63 శాతం ఉండగా రాష్ట్రంలో 66.1 పూర్తయిందన్నారు. టీకాలు 87 శాతం ప్రభుత్వం అందించగా...13 శాతం ప్రైవేటు వైద్యశాలలు అందించాయన్నారు.

వాళ్లకు బూస్టర్​ డోసు ఇస్తాం..

రాష్ట్రంలో టీకాల కొరత లేదన్న మంత్రి... 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి 15 నుంటి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా ఇవ్వనున్నామన్నారు. ఇందుకు కోసం ఒక ప్రక్రియ తయారు చేస్తున్నామన్నారు. ముందుగా హైదరాబాద్ ఇతర మున్సిపాలిటీల పరిధుల్లో కొవిన్​లో నమోదు చేసుకున్నవారికి.. పీహెచ్సీలు, మెడికల్ కాలేజీలలో టీకా అందిస్తామన్నారు. వయసు సందిగ్ధం లేకుండా 2007 అంతకంటే ముందు పుట్టినవారు ఎవరైనా టీకా తీసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22 లక్షల 78 వేల మంది 15- 18 ఏళ్ల పైబడిన వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. జనవరి 10 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు హరీశ్​రావు. అనుమతి వస్తే 41 లక్షల 60 వేల మంది 60 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసు అందిస్తామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన పోలీసులు, పారశుద్ధ్య కార్మికులు, వైద్యారోగ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులకు సైతం జనవరి 10నుంచి టీకా అందిస్తామని హరీశ్​రావు స్పష్టం చేశారు.

తెలంగాణది మూడో స్థానం...

"రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇందుకు కేంద్రం విడుదల చేసిన వైద్య రంగం పురోగతి గణాంకాలే నిదర్శనం. కేంద్ర ఆరోగ్య శాఖ, వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్ కలిసి చేసిన పరిశోధనలో వైద్య పురోగతిలో తెలంగాణ 3వ స్థానానికి రావడం చాలా మంచి పరిణామం. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని విర్రవీగిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చివరి స్థానానికి పరిమితమైంది. ఓమిక్రాన్ విషయంలో ఎలాంటి విపత్తు వచ్చినా... రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేస్తున్నాయి. వ్యాక్సినేషన్ బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ విషయమై కేంద్రం లక్ష్యం విధించింది. రాష్ట్ర జనాభాలో 2,77,67,000 మందికి టీకాలు వేయాలి. రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలి. రాష్ట్రంలో తొలి డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశాం. రెండో డోసు 66.1 శాతం పూర్తి చేశాం. తొలి డోసులో జాతీయ సగటు కంటే పది శాతం అధికం సాధించాం. రెండో డోసులో జాతీయ సగటు 63.1 శాతంగా ఉంది. జాతీయ సగటు కంటే 3 శాతం ఎక్కువ సాధించాం." - హరీశ్​ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

Last Updated : Dec 28, 2021, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details