కాళేశ్వరంతో పాటు దేవాదుల తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చెరువులను నింపుతున్నందున కొత్తగా చెరువుల నుంచి పంట కాలువలను కూడా ఉపాధి కూలీలతో తవ్వించే అవకాశం ఉన్నా.. నీటిపారుదల శాఖ పెద్దగా దృష్టి సారించడం లేదు. రహదారులు భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖ కూడా ఉపాధి కూలీలను వాడుకోవడంలో విముఖత చూపుతోంది. ఉపాధి హామీ పథకంలో ‘కన్వర్జెంట్’ కింద కూలీలను ఇతర శాఖలకు కేటాయించే అవకాశముంది. సంబంధిత శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి ఆ జాబితాను ఎంపీడీవోలకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు పరిశీలించి అవసరమైన కూలీలను కేటాయిస్తారు. సాగునీరు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు మాత్రం పనుల గుర్తింపును పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో ఆయా శాఖలు ఒక్క పనిని కూడా గుర్తించకపోవడం గమనార్హం.
సాగునీటి శాఖ :
కరీంనగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఈ శాఖ ఒక్క పనినీ గుర్తించలేదు. ఖమ్మం, భూపాలపల్లి, ఆదిలాబాద్, రాజన్నసిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో అధికారులు రెండు, మూడు పనులను మాత్రమే గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 339 పనులను గుర్తించారు. ఈ శాఖ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి కేవలం 1,414 పనులను మాత్రమే గుర్తించింది.