Telangana Inter Board Negligence : వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్‌బోర్డు నిర్లక్ష్యం విద్యార్థులను బెంబేలెత్తిస్తోంది. పరీక్షల ప్రారంభం రోజు ప్రశ్నల పునరావృతం నుంచి రోజుకొక సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హిందీ మాధ్యమం విద్యార్థులకు బుధవారం తొలి ఏడాది పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రాలను చేతితో రాసి ఇవ్వడం గమనార్హం.
Telangana Intermediate Board Negligence : హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ కళాశాల, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో ఈ పరీక్ష రాసిన విద్యార్థులున్నారు. ప్రథమ సంవత్సరం 32 మంది, ద్వితీయ ఇంటర్ 24 మంది రాశారు. ఉదయం 8.30 గంటలకు ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరిచిన తర్వాత ఆంగ్ల మాధ్యమం పేపర్‌ను అనువాదకుడితో హిందీలో రాయించి.. దాన్ని నకళ్లు తీయించి ఇచ్చారు. చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సబ్జెక్టు నిపుణులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బోర్డు అధికారులు అంటున్నారు. ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. ఆప్షనల్ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని తెలిపారు.