తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారులు హెచ్చరించినా.. వెనుదిరగని సీఆర్పీఎఫ్​ బలగాలు - Telangana Intelligence Department

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆపరేషన్‌లో ఎక్కడ తప్పిదం జరిగింది? ఈ దిశగా  పోలీసు శాఖలో అంతర్గత విశ్లేషణ సాగుతోంది.

chhattisgarh incident, chhattisgarh maoists
ఛత్తీస్​గఢ్ న్యూస్, ఛత్తీస్​గఢ్ మావోల న్యూస్

By

Published : Apr 8, 2021, 8:10 AM IST

ఛత్తీస్​గఢ్ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ బలగాలకు ప్రాణనష్టం జరగడానికి గల కారణాలపై మావోయిస్టు కార్యకలాపాల అణచివేతలో విశేష అనుభవం కలిగిన తెలంగాణ నిఘా విభాగం కీలక సమాచారం సేకరించింది. సీఆర్పీఎఫ్‌ జవాన్ల బృందం గంటలకొద్దీ ఒకే ప్రాంతంలో వేచి ఉండటంతోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

మావోయిస్టులు దండకారణ్యం పరిధిలోని బీజాపుర్‌ జిల్లా పువర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నారని పోలీస్‌ బలగాలకు ఉప్పందింది. పువర్తి గ్రామం మావోయిస్టు బెటాలియన్‌ కమాండర్‌ మడావి హిడ్మా స్వగ్రామం కావడంతో అతడు ఉండి ఉంటాడనే అనుమానంతో బలగాలు ఈ నెల 3న ఉదయం కూంబింగ్‌కు వెళ్లాయి. సీఆర్పీఎఫ్‌, కోబ్రా, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. స్థానిక పరిస్థితులపై పట్టు కలిగిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్జీ) సిబ్బంది జవాన్లకు సహకారంగా వెళ్లారు.

బావి సమీపంలో కూంబింగ్‌ ఆపరేషన్‌

పువర్తి చుట్టుపక్కల ఉన్న టేకులగూడెం, జొన్నగూడెం, జీరగూడెం, ఉసంపురా.. తదితర ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టాయి. మావోయిస్టులు స్నానాల కోసం తరచూ టేకులగూడెం శివార్లలోని ఓ బావి వద్దకు వస్తున్నారనే సమాచారం మేరకు ఓ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో సమీపంలోని గుట్టపై కూంబింగ్‌కు వెళ్లింది. అక్కడ మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకుని అయిదుగురు జవాన్లు మృతి చెందారు. కొంతసేపటి తర్వాత కాల్పులు నిలిచిపోవడంతో మృతదేహాలను జవాన్లు టేకులగూడెం ఊళ్లోకి తీసుకొచ్చారు. అప్పటికే 5 గంటలు గడిచిపోగా.. పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టు దళాలు అటు వైపు వస్తున్నాయంటూ బీజాపూర్‌ ఎస్పీ కార్యాలయం నుంచి జవాన్లను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులూ హెచ్చరించారు. అయితే సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లోని నాగాలాండ్‌కు చెందిన జవాన్లు అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలిద్దామనే ఉద్దేశంతో మరో గంట పాటు అక్కడే ఆగిపోయారు. ఆలోపే మావోయిస్టులు దాడి చేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

‘కానిస్టేబుల్‌ను విడుదల చేయాలి’

మావోయిస్టులు తమ ఆధీనంలోని కానిస్టేబుల్‌ రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ జి.హరగోపాల్‌, సహ కన్వీనర్లు జి.లక్ష్మణ్‌, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్‌లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

దాడికి హిడ్మా పరోక్ష ఆదేశాలు!

ఈ భీకర దాడిలో దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ప్రత్యక్షంగా పాల్గొనలేదని నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన బెటాలియన్‌కు మార్గనిర్దేశం చేసి ఉంటాడని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details