తెలంగాణ

telangana

ETV Bharat / city

Hc On Hcu Lands: 'ఆ భూములపై హెచ్​సీయూకి ఎలాంటి హక్కుల్లేవు'

Hc On Hcu Lands: హెచ్​సీయూ అధీనంలోని భూములపై విశ్వవిద్యాలయానికి చట్టబద్ధ హక్కుల్లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. భూములపై చట్టబద్ద హక్కులను సివిల్ కోర్టులో తేల్చుకోవాలని యూనివర్సిటీకి కోర్టు సూచించింది. తమ భూముల్లో జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మిస్తోందంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రోడ్డు నిర్మిస్తున్న స్థలం ప్రభుత్వానిదేనని రికార్డులు చెబుతున్నాయని తీర్పు వెల్లడించింది.

telangana high court verdict on hcu lands dispute
telangana high court verdict on hcu lands dispute

By

Published : Jan 7, 2022, 5:06 AM IST

Hc On Hcu Lands: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం కేటాయించిన భూములపై హెచ్​సీయూకి చట్టబద్ధ హక్కులు లేవని పేర్కొంది. గచ్చిబౌలి ఎన్జీవో కాలనీ కోసం జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న రోడ్డుపై హెచ్​సీయూ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. తమ భూములను ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నారని హెచ్​సీయూ వాదించింది. అన్ని వైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఆ భూములు హెచ్​సీయూవే అనేందుకే చట్టబద్ధమైన ఆధారాలే లేవని తేల్చింది.

ప్రభుత్వం వద్దే భూమి..

హెచ్​సీయూ కోసం 1975లో రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 324 ఎకరాలను కేటాయించింది. అయితే భూములపై హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు లేవని హైకోర్టు పేర్కొంది. తమకు మరోచోట భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. 2013లో క్రీడా అకాడమీ ఏర్పాటు కోసం 500 ఎకరాలను హెచ్​సీయూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్​కు కేటాయించింది. ఆ తర్వాత ఐఎంజీని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో.. వివాదం ఏర్పడింది. ఆ వివాదంలోనూ హెచ్ సీయూ ప్రతివాదిగా లేదంటే.. భూమి ప్రభుత్వం వద్దే ఉన్నట్లని హైకోర్టు పేర్కొంది.

సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు..

తమకు 500 ఎకరాలు పోగా మిగిలిన భూమిని చట్టబద్ధంగా కేటాయించాలని 2013లో ప్రభుత్వాన్ని హెచ్​సీయూ కోరింది. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ హెచ్​సీయూకి 1626 ఎకరాలు కేటాయించి... 159 ఎకరాలు ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వ్​లో ఉంచాలని సిఫార్సు చేసింది. రిజర్వ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసిన భూముల్లోనే ప్రస్తుత రోడ్డు నిర్మాణం జరుగుతోదంని తీర్పులో హైకోర్టు పేర్కొంది. రోడ్డు నిర్మాణం కోసం అవసరమైతే భూసేకరణ చేయాలన్న హెచ్​సీయూ వాదనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టబద్ధమైన హక్కులే లేనప్పుడు భూసేకరణ ప్రశ్నే తలెత్తదని పేర్కొంది. ఎన్జీవో కాలనీలో ఇప్పటికే విశాలమైన రోడ్డు ఉన్నందున.. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారి అవసరం లేదన్న వాదననూ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రోడ్డు ఎక్కడ నిర్మించాలనేది విశాల ప్రయోజనాలను దృష్టిలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. రికార్డుల్లో పోరంబోకు భూమిగా ఉన్నందున ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కేటాయించిందని తెలిపింది. హెచ్​సీయూ పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్.. భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పులో హెచ్​సీయూకి సూచించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details