తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభం

By

Published : Nov 7, 2019, 10:52 AM IST

Updated : Nov 7, 2019, 3:29 PM IST

09:59 November 07

ఆర్టీసీ సమ్మె - విచారణ 11కి వాయిదా.!

ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. ప్రభుత్వం ఇచ్చిన​ నివేదికలోని అంకెలు, లెక్కలు తప్పు చూపించారని ఐఏఎస్​లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా సమాధానం చెబుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సీఎస్‌ జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు. 

స్వయంగా వివరణ ఇవ్వండి: సీఎస్‌కు కోర్టు ఆదేశం

అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కింద వస్తుందని తెలుసా ?అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ అధికారుల నివేదికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కోర్టును క్షమాపణ కోరిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి

రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు...మన్నించాలని రామకృష్ణారావు కోర్టును కోరారు. అయితే దీనిపై క్షమాపణ కోరడం సమాధానం కాదని, వాస్తవాలు చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఐఏఎస్​లు అబద్దాలు ఆపండి.!

నివేదికలోని అంకెలు, లెక్కలపై మరోసారి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ, ఆర్థికశాఖ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. మేం వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ధర్మాసనం వెల్లడించింది. 

ప్రభుత్వాన్ని, సీఎంను, ప్రజలను తప్పుదోవ పట్టించారు..!

ఉద్దేశపూర్వకంగానే అధికారులు తప్పుదోవ పట్టించినట్లు అర్థమవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ విషయం ఆర్టీసీ ఎండీ నివేదికలో అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ప్రభుత్వాన్ని, సీఎంను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆక్షేపించింది.

మాతో వ్యవహరించే తీరు ఇదేనా..?

తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీని ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. నిధులు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు జీహెచ్‌ఎంసీని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఆర్థికశాఖలు.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నివేదికలు ఇచ్చారు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇవ్వటంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

నా సర్వీసులో ఇలాంటి అధికారులను చూడలేదు

తన సర్వీసులో ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను చూడలేదని సీజే వ్యాఖ్యానించారు. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కనీసం ప్రభుత్వం, ఆర్టీసీ వాస్తవాలు చెప్పడం లేదని... చిత్తశుద్ధితో ముందుకు రావడం లేదని వెల్లడించింది. 
 

ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదు

కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదన్న విషయం ధర్మాసనం ముదుంచారు. టీఎస్‌ఆర్టీసీలో 33శాతం వాటా ప్రశ్నే లేదని.. ఏపీఎస్‌ఆర్టీసీలోనే కేంద్రానికి 33 శాతం వాటా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా టీఎస్‌ఆర్టీసీకి బదిలీ కాదని వెల్లడించారు. 

విభజన పెండింగ్‌లో ఉంటే.. కొత్త ఆర్టీసీ ఎందుకు..?

విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు అడ్వకేట్​ జనరల్​, ఆర్టీసీ ఎండీ కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విభజన పెండింగ్‌లో ఉన్నప్పుడు కొత్త ఆర్టీసీ ఎందుకు ఏర్పాటు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది.
 

రాష్ట్రం దేశానికే ఆదర్శం... కానీ ఆర్టీసీ విషయంలోనే ఎందుకలా..?

సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిరాకరించిందని న్యాయస్థానం పేర్కొంది. రైతులకు కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇచ్చి, దేశంలోనే అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వెల్లడించింది. కానీ ఆర్టీసీ విషయంలోనే ప్రభుత్వ వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. 
 

విచారణ ఈనెల 11కి వాయిదా.!

ప్రభుత్వం, కార్మిక సంఘాల వైఖరి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధర్నాసనం తెలిపింది. సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్ఘాటించింది. సమ్మెపై మరోసారి ఆలోచించాలని ఇరుపక్షాలకు సూచించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 11కి వాయిదా వేసింది.
 

Last Updated : Nov 7, 2019, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details