నిధుల కోసం దేన్ని పట్టించుకోకుండా వేలం వేస్తారని... ఇతరుల విషయానికి వస్తే మాత్రం పర్యావరణం ఇతర అంశాలు గుర్తుకొస్తాయంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకో న్యాయం ... ఇతరులకో న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆకాశహర్మ్యాల నిర్మాణాలు చేపట్టే ముందు అక్కడ రోడ్లు, మురుగునీటి పారుదల తదితర మౌలిక వసతులు కల్పించాక నిర్మాణాలకు అనుమతించవచ్చని తెలిపింది. ఇవి ఏవీ లేకుండానే వేలం నిర్వహించి నిర్మాణాలకు అనుమతిస్తారని... అదే ప్రైవేటు భూములకైతే కమిటీలు నివేదికలంటూ ఏళ్లకు ఏళ్లు తేల్చకుండా కాలయాపన చేస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయాల పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని పేర్కొది. జీవో 111కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో పాటు, జీవో 111 పరిధిలో లేని తమ భూమిని మినహాయించాలంటూ అగ్ని అగ్రిటెక్ సైట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ పైప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
నిధులు కావాలంటే నివేదికలు వద్దా..
ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వట్టినాగులపల్లిలో నీటి పరివాహక ప్రాంతంలోకి రాని భూములను జీవో 111 నుంచి మినహాయించాలంటే తెరి( ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్), ఎన్టీఆర్ వంటి నివేదికలు కావాలంటారని... మరి అవే నివేదికలను సమీపంలోని భూములకు నిర్వహించిన వేలానికి ముందు తెప్పించారా అంటూ ప్రశ్నించింది. మీకు నిధులు కావాలంటే ఏవీ అవసరం ఉండదని, ఇతరత్రా అయితే కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు కావాలంటారా అని నిలదీసింది. అధ్యయనం ఏమిటో చెప్పాలంది. 3.5 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలకు కమిటీలు వేస్తామని... 1000 మీటర్ల దూరంలో వాటికి మాత్రం ఏవీ వర్తించవంది.
అలా ఎందుకు చెప్పారు...
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ సమాధానమిస్తూ... కోకాపేట భూములు జీవో పరిధిలోకి రావని.. వేలం వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ నీటి పరీవాహక ప్రాంతానికి సంబంధించి 1992 నుంచి పలు సర్వేలు, అధ్యయనాలు జరిగాయని, 1996, 2007 నాటి ప్రొసీడింగ్స్ తెలిపారు. నీటి పరీవాహక ప్రాంతానికి సంబంధించి అప్పట్లో రైతులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారని, ఈపీటీఆర్ కమిటీ ఏర్పాటైందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఈపీటీఆర్ఎ నివేదిక ఇచ్చిందని, ప్రభుత్వం ఈ నివేదికను అంగీకరించిందని చెప్పి... మళ్లీ ఎన్జీటీ ముందు మరో కమిటీ వేస్తామని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది.