Telangana High Court On GO-317 :కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన జీవో 317పై... స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 317ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వలేమని హైకోర్టు పునరుద్ఘాటించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది.
కొందరికి వరం.. మరికొందరికి శాపం..
Telangana High Court On Jobs Allocation : తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికి వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకోవటం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ నిరసన గళం..
Telangana High Court On Stay on GO-317 : ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా ఉద్యోగులకు మద్దతుగా ప్రభుత్వంపై నిరసన గళమెత్తుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల విభజన, బదిలీల్లో స్థానికతను పరిగణించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని పేర్కొన్నారు. చర్చల తర్వాత మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టాలని కోరారు.
భాజపా ఉద్యమం..
Oppositions on Job Allocation : మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు. ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే.. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన.. భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు.