తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా తగ్గిపోయాక చికిత్స గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..?: హైకోర్టు - తెలంగాణ హైకోర్టుకు డీహెచ్​ శ్రీనివాసరావు

వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా తగ్గిపోయాక.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..? అని ప్రశ్నించింది. పైవేటు ఆస్పత్రులు అధికంగా వసూలు చేసిన రుసుమును బాధితులకు ఇప్పించారా అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది.

telangana high court hearings on corona
ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

By

Published : Jun 9, 2021, 6:51 PM IST

Updated : Jun 9, 2021, 7:05 PM IST

కరోనాపై హైకోర్టులో విచారణకు వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డీహెచ్​ శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరల ఖరారుకు నాలుగు వారాల గడువు కావాలని రిజ్వీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రుసుములపై అధ్యయనం చేసి.. ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. ఇప్పటికే 4 వారాలు గడువు ఇచ్చామన్న హైకోర్టు.. ఇంకా 4 వారాలు ఎందుకంటూ రిజ్వీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం 2 వారాలు సమయం ఇవ్వాలని రిజ్వీ అభ్యర్థించగా.. చివరి అవకాశంగా 2 వారాలు సమయం ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో ఉత్తర్వులు జారీ చేసి సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

రేపటి నుంచి ఆర్టీపీసీఆర్​ ల్యాబ్​లు..

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.07 శాతానికి తగ్గిందని డీహెచ్​ శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. రేపటి నుంచి కొత్తగా 14 ఆర్టీపీసీఆర్​ ల్యాబ్​లు పనిచేస్తాయని హైకోర్టుకు నివేదించారు. సలహా కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందన్న హెల్త్​ డైరెక్టర్​.. వారంలో జీవో జారీ అవుతుందని తెలిపారు.

వారికి నగదు వెనక్కి ఇప్పించారా..?

ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అధిక రుసుములు తిరిగి ఇప్పించారా? అని హైకోర్టు ప్రశ్నించగా.. సుమారు 65 లక్షల రూపాయలు బాధితులకు వెనక్కి ఇప్పించామన్నారు. మిగతా బాధితులకు త్వరగా డబ్బులు ఇప్పించాలని హైకోర్టు సూచించింది. రెండు వారాల్లో బాధితులకు సొమ్ము ఇవ్వాలని.. ఆస్పత్రులను ఆదేశించామని డీహెచ్​ ధర్మాసనానికి నివేదించారు. 135 ఆస్పత్రులపై 223 ఫిర్యాదులు వచ్చాయన్న డీహెచ్​.. 22 ఆస్పత్రుల లైసెన్సులు పునరుద్ధరించామని వెల్లడించారు.

థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..

రాష్ట్రంలో మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని.. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేస్తామని డీహెచ్​ తెలిపారు. ఇప్పటి వరకు 41 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామన్నారు. 17 లక్షల మంది ఒక డోసు వేసుకున్నారని హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రంలో మరో 2.18 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. జులై 2 నాటికి కేంద్రం నుంచి మరో 17 లక్షల డోసులు రానున్నాయని హైకోర్టుకు డీహెచ్​ వివరించారు. కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సలకు 4 వేల పడకలు సిద్ధం చేస్తున్నామని శ్రీనివాసరావు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

సుమారు 38 కోట్ల జరిమానా విధించాం..

హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ మహేందర్‌రెడ్డి.. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఔషధాల బ్లాక్‌మార్కెట్‌పై 160 కేసులు నమోదు చేశామని వివరించారు. కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘనలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8 లక్షల 79 వేల కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించని వారిపై 4 లక్షల 56 వేల కేసులు నమోదు చేసి.. 37 కోట్ల 94 లక్షల జరిమానా విధించామని హైకోర్టుకు నివేదించారు. భౌతిక దూరం పాటించనందుకు 48 వేల 643 కేసులు నమోదు చేశామని.. లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 3 లక్షల 43 వేల కేసులు పెట్టామని పోలీస్​ బాస్​.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు.

అత్యవసర జాబితాలో చేర్చగలరా లేదా..

కరోనా ఔషధాలపై జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ.. హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. కరోనా మందులు అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలన్న అంశంపై నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చగలరా లేదా సూటిగా చెప్పాలన్న హైకోర్టు నిలదీసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఎన్‌పీపీఏ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవీచూడండి:కుర్రాడికి ఆస్పత్రి ఫోన్.. మీరు చనిపోయారంటూ...

Last Updated : Jun 9, 2021, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details