వచ్చే నాలుగు వారాల్లోగా.. ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీసుల ఫిర్యాదు మండలిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా.. వీటిని వాయిదా వేయవద్దని చెప్పింది. మరోవైపు.. భద్రతా కమిషన్, పోలీసు ఫిర్యాదుల మండళ్ల ఛైర్మన్, సభ్యుల పేర్ల జాబితాను పరిశీలించి ఆమోదం చెబుతామని, అనంతరం నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది.
ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీసు ఫిర్యాదుల మండళ్లను ఏర్పాటు చేయాలంటూ 2017లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాలేదంటూ అదే ఏడాది ఎన్.ఎస్.చంద్రశేఖర శ్రీనివాసరావు రాసిన లేఖను హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా తీసుకుని పలుమార్లు విచారించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.