పెండింగ్ చలానాలు కారణంగా రోడ్డెక్కెందుకు భయపడుతున్న వాహనదారులకు హైకోర్టు మార్గదర్శకాలు కాస్త ఊరటనిచ్చాయి. చట్టప్రకారం వాహనం సీజ్ చెయొద్దంటూ హైకోర్టు సూచనలిచ్చింది.
కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తొగరి.. ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా పర్వత్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్ కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఒక్క చలానాకే సీజ్ చేస్తారా అంటూ న్యాయవాది నిలదీశారు. నిబంధనల ప్రకారమే చేశామని పోలీసులు తెలిపారు.
చలానా ఎక్కడ వేశారు..? ఎందుకు వేశారు? అంటూ సదరు న్యాయవాది పోలీసులను ప్రశ్నించారు. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా రూ.1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సిందని.. ఇంత ఎలా రాశారు? ఒక్క ఉల్లంఘనకు మూడు శిక్షలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.