సచివాలయం కూల్చివేతపై మీడియాకు బులెటిన్ విడుదల చేస్తాం కానీ.. అక్కడికి అనుమతించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వమే జర్నలిస్టులను తీసుకెళ్ళి చూపిస్తుందని ఊహించామన్న హైకోర్టు.. దాచి పెట్టడం వల్ల ప్రజల్లో అనవసర అపార్ధాలు తలెత్తుతాయని వ్యాఖ్యానించింది. సచివాలయం చుట్టుపక్కల ప్రైవేటు భవనాలపై నుంచి చిత్రీకరిస్తే మీడియాను అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతించాలన్న పిటిషన్ పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. కూల్చివేత వివరాలతో మీడియాకు బులెటిన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కూల్చివేతలు, నిర్మాణ ప్రాంతానికి ఎవరినీ అనుమతించవద్దని నిబంధనలు చెబుతున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజలు, మీడియాతో పాటు కోర్టును కూడా ప్రభుత్వం చీకట్లో పెట్టడానికి ప్రయత్నిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ వాదించారు. బులెటిన్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదని అందులో సమగ్ర వివరాలు ఉండవని వాదించారు. యుద్ధ జోన్లు, కరోనా వార్డులు, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కి వెళ్లి కూడా కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. బులెటిన్ లో కేవలం సమాచారం ఉంటుందని.. కానీ అక్కడ జరుగుతున్నది ప్రత్యక్షంగా ప్రజలకు మీడియా చూపించ లేదని పేర్కొన్నారు.
మీడియాకు టూర్ ఏర్పాటు చేసి జర్నలిస్టులను తీసుకెళ్లగలరా అని హైకోర్టు అడిగగా... ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానని ఏజీ పేర్కొనడం వల్ల విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
జర్నలిస్టులను అనుమతించలేమని.. బులెటిన్ మాత్రమే ఇస్తామని మధ్యాహ్నం విచారణ సందర్భంగా హైకోర్టుకు ఏజీ ప్రసాద్ తెలిపారు. కూల్చివేతల వద్దకు జర్నలిస్టులను అనుమతిస్తే వారికి ప్రమాదం జరగవచ్చని తెలిపారు. అందరూ గుమిగూడటం వల్ల కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని స్పష్టం చేశారు.
వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వమే జర్నలిస్టులను తీసుకెళ్తుందని ఊహించామని వ్యాఖ్యానించింది. అరగంటనో..గంటనో నిర్దిష్ట వేళల్లో.. షరతులతో అనుమతించడం వల్ల ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. దాచి పెట్టడం వల్ల ప్రజల్లో అనవసరమైన అపార్ధాలు దారితీసే అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నించింది. పూర్తి స్థాయి వాదనలు విని తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సచివాలయం పక్కనున్న ప్రైవేటు భవనాల నుంచి మీడియా కానీ మరెవరైనా చిత్రీకరిస్తే అడ్డుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ శనివారానికి వాయిదా వేసింది.