కరోనా నుంచి కోలుకున్న వారికి అవసరమైన చికిత్సలతో పాటు... మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా చికిత్సల గరిష్ఠ ధరలకు సంబంధించిన జీవోకు కోరలు సరిగా లేవని అభిప్రాయపడింది. ఇటీవల 1,640 మంది ఒప్పంద నర్సుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు నమోదు కాలేదని... అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నట్లు హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని.. 87 వేల మందిపై కేసులు నమోదు చేసి.. 52 కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు డీజీపీ నివేదించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వైద్యారోగ్య, విద్య, పోలీసు, జైళ్లు, శిశు సంక్షేమ శాఖలు, జీహెచ్ఎంసీ నివేదికలు సమర్పించాయి.
సిద్ధంగా ఉన్నాం...
రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. అయినప్పటికీ డెల్టాప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరమనే ఆధారాలేమీ లేవని డీహెచ్ వివరించారు. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లోని పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో సరాసరి రోజుకు లక్షా 12 వేల కరోనా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గిందని తెలిపారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న వరంగల్ అర్బన్ వంటి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హైకోర్టు సూచించింది.
చురుగ్గా వ్యాక్సిన్ కార్యక్రమం...
వ్యాక్సిన్ల కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల డోసుల టీకాలు ఇచ్చినట్టు డీహెచ్ వివరించారు. ఇప్పటి వరకు 16 లక్షల 39 వేల మందికి రెండు డోసులు, 81 లక్షల 42 వేల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మరో కోటి 75 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని డీహెచ్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నామన్నారు. విద్యా సంస్థల్లో లక్షా 40 వేల మంది బోధన, బోధనేతర సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్టు డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో 6,127 మంది ఖైదీలకు ఒక డోసు.. 732 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని జైళ్ల శాఖ డీజీ వివరించారు. మరో 1,244 మంది ఖైదీలకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు.దివ్యాంగులు, మానసిక వికలాంగులను కూడా హై రిస్కు కేటగిరిలో చేర్చి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆస్పత్రుల ఫీజుల జీవోపై ఆసంతృప్తి...
ఇప్పటి వరకు 231 ఆస్పత్రులపై 594 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 38 ఫిర్యాదుల్లో బాధితులకు సుమారు కోటి రూపాయలు ఇప్పించినట్టు డీహెచ్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేట్ వైద్య కేంద్రాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే జీవోకు కోరలు సరిగా లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. భారీగా జరిమానాలు విధించాలన్న సూచనను పరిశీలించారా...? అని ప్రశ్నించింది. జరిమానాలను పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని డీహెచ్ తెలిపారు. కేంద్రం రూపొందించిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని త్వరలో స్వీకరించనున్నామని.. దాని ప్రకారం మరింత కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కేంద్రం చట్టం స్వీకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
నర్సుల తొలగింపుపై ఆరా...
1,640 మంది ఒప్పంద నర్సుల తొలగింపుపై హైకోర్టు ఆరా తీసింది. రెగ్యులర్ ఉద్యోగులను నియమించినందున.. ఒప్పంద నర్సులను తొలగించినట్లు డీహెచ్ తెలిపారు. ఒప్పంద నర్సుల తొలగింపుపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వైద్యారోగ్య శాఖలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ వివరాలు కూడా తెలపాలని ఆదేశించింది.
పరీక్షలపై జోక్యం చేసుకోలేం...
విద్యా సంస్థల్లో ఆన్లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. ఆన్లైన్ బోధన మార్గదర్శకాలను హైకోర్టుకు సమర్పించారు. అయితే తరగతులు ఆన్లైన్లో జరుగుతున్నప్పటికీ.. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారని న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, ఎల్.రవిచందర్ తదితరులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పరీక్షల విషయంలో తాము జోక్యం చేసుకోమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పరీక్షలపై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికే తెలపాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా కోర్టును ఆశ్రయిస్తారని.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అవసరం లేదని పేర్కొంది.
వారికి కౌన్సెలింగ్ ఇవ్వండి...
దీర్ఘకాలిక కరోనాతో బాధపడుతున్న వారికి తీవ్రస్థాయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని.. ఆస్పత్రుల్లో ఓపీ, ఇన్ పేషంట్ సేవలు అందుబాటులో ఉన్నాయా..? అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాతో కోలుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టామని.. అవసరమైన చికిత్సలు అందిస్తున్నామని డీహెచ్ వివరించారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
భారీగా జరిమానాలు...
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై జూన్ 20 నుంచి ఈనెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేసి 52 కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు డీజీపీ తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నామని శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య తెలిపారు. ఒక్కో చిన్నారికి ఒక నోడల్ అధికారిని నియమించామని వివరించారు. వర్షాకాలంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
ఆగస్టు 11న తదుపరి విచారణ...
కరోనా ఔషధాలను అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చే అంశం పరిశీలిస్తున్నామని... దీనిపై కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని సహాయ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కోరారు. సీరో సర్వైలెన్స్ నిర్వహించామని.. విశ్లేషణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తదుపరి విచారణలో సీరం సర్వైలెన్స్ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.