Telangana High Court On Corona : రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదన్న హైకోర్టు.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు డీహెచ్ శ్రీనివాసరావు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతానికి చేరిందని వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు వివరించింది. అయితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేసే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని వివరించింది. ఇంటింటి సర్వేలో మూడు రోజుల్లోనే లక్ష 78 వేల మంది జ్వర బాధితులను గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు నివేదించింది.
ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని.. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డీహెచ్ వివరించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని స్పష్టం చేశారు.