రాష్ట్రంలో లాలాపేటలోని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2016 మే 6న జారీ చేసిన జీవో 8ను సవాలు చేస్తూ కార్పొరేషన్ ఎండీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రారావు, జస్టిస్ టీ.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున ఏపీ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల ఆస్తులు రెండింటికీ చెందుతాయని పేర్కొన్నారు. తెలంగాణ పరిధిలో ఉన్నంత మాత్రాన దానికే పరిమితం కాదనన్నారు.
సేవల ఆధారంగానే ...
పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సంస్థ అందిస్తున్న సేవల ఆధారంగా విభజన జరగాలని... అంతేగాని అది ఉన్న ప్రాంతం ఆధారంగా కాదన్నారు. ఇందులో ప్రధానకార్యాలయం నిర్వచనాన్ని పరిశీలించాలని... కేవలం కార్యాలయం దాని అతిధి గృహం మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలకు సేవలందిస్తున్న ఫ్యాక్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. 9 షెడ్యూలులోని ఆస్తుల పంపకం జరగకపోయినా లాలాపేటలోని పరిశ్రమను రాష్ట్రానికి వర్తింపజేసుకుంటూ జీవో జారీ చేసిందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పాలు వస్తాయన్నారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి...
తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీ.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా డెయిరీ విభజన తాత్కాలికంగానే జరిగిందన్నారు. ప్రధాన కార్యాలయంలో రెండస్తులు ఏపీకి, రెండంతస్తులు తెలంగాణకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. లాలాపేటలో ఉన్నది ప్రధాన కార్యాలయం కాదని, తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందని... ఏపీలోని కేంద్రాల్లో తెలంగాణ హక్కులు కోరడం లేదన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 47(4), 66, 71ల ప్రకారం కేంద్రానికి అధికారం ఉందనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ సెక్షన్‌లు ఆస్తుల పంపకానికి చెందిన అంశాలని... అంతేగానీ 9, 10వ షెడ్యూలులో ఉన్నవాటి పంపకానికి వర్తించవని పేర్కొంది.