తెలంగాణ

telangana

ETV Bharat / city

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ కొట్టివేత

రాష్ట్రంలో రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. మంత్రివర్గం నిర్ణయంలో తమకు తప్పేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆపరేటర్లకు రూట్ల అనుమతి ప్రక్రియ మోటారు వాహనాల చట్టం ప్రకారమే కొనసాగాలని స్పష్టం చేసింది. ప్రక్రియ అమలు చేసేందుకు రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారాలు అప్పగించడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది.

tsrtc strike

By

Published : Nov 22, 2019, 9:26 PM IST

Updated : Nov 22, 2019, 11:31 PM IST

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ కొట్టివేత

రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్ నిర్ణయం చట్టవిరుద్ధమన్న వాదనకు పిటిషనర్ తగిన ఆధారాలు చూప లేకపోయారని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మంత్రివర్గం నిర్ణయంలో తప్పేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం రవాణా వ్యవస్థపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని తేల్చింది.

ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది

ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతినిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ రంగంలోనైనా పోటీ తత్వం ఆహ్వానించదగినదేనని... కాదనలేమని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 5,100 రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు ఆచార్య పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది.

పిటిషనర్​ వాదన ఊహాజనితం

రవాణా సదుపాయాలు మెరుగు పరచడానికి... రద్దీ తగ్గించేందుకు.. పోటీతత్వం పెంచేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. చట్టంలో పేర్కొన్న రవాణా సేవలకు అర్థం ప్రభుత్వ రంగంతో పాటు... ప్రైవేట్ ఆపరేటర్లకూ వర్తిస్తుందని తెలిపింది. కేబినెట్ నిర్ణయం వల్ల ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్న పిటిషనర్ వాదన ఊహాజనితమని పేర్కొంది.

రవాణా అథారిటీకి ఆ అధికారం లేదు

రూట్ల ప్రైవేటీకరణ కోసం మోటారు వాహనాల చట్టంలోని 102 ప్రకారం ప్రక్రియ చేపట్టే అధికారాన్ని రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రభుత్వమే చేయాలని.. మరో సంస్థ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియ నిర్వహిస్తారని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ఏజీ వాంగ్మూలాన్ని నమోదు చేసిన హైకోర్టు... ఎంవీ చట్టం ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియ చేపట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకు వెళ్తాం

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు పిటిషనర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ఆయన తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. తమ వాదనలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

Last Updated : Nov 22, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details