రిజిస్ట్రేషన్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం అక్టోబరు 29 తర్వాత అందిన దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29న అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులు వచ్చాయని.. అక్టోబరు 29 నుంచి దరఖాస్తుల చివరి రోజైన నిన్నటి వరకు 6 లక్షల 74 వేల 201 దరఖాస్తులు వచ్చాయని అడ్వకేట్ జనరల్ వివరించారు.
చట్టాలకు లోబడే ఉండాలి..
కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పేద చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు... చట్టాలకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధత లేని జీవోలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు.