28న శుభవార్త చెబుతారని ఆశిస్తున్నాం: హైకోర్టు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఈనెల 18న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్టీసీ ఐకాస, టీఎంయూలను చర్చలకు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. చర్చల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని పేర్కొంది. డిమాండ్ల కోసం కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చినప్పుడు.. వివాదం పరిష్కరించేందుకు కార్మిక శాఖ ప్రయత్నించినప్పటికీ... దురదృష్టవశాత్తు సఫలం కాలేదని హైకోర్టు పేర్కొంది. ఈనెల 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
గడువు ఇచ్చినా ఫలితం లేదు
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, కార్మిక సంఘాలను కోరి మూడు రోజుల గడువు ఇచ్చామని ధర్మాసనం తెలిపింది. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదని... వివాదాన్ని పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారమే చూడాలని అదనపు ఏజీ వివరించారని హైకోర్టు పేర్కొంది. అయితే కార్మిక శాఖ వద్ద చర్చల ప్రక్రియ విఫలమయ్యాక.. యాజమాన్యం లేబర్ కోర్టు లేదా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించలేదని న్యాయస్థానం గుర్తు చేసింది. మళ్లీ చర్చల ప్రక్రియ చేపట్టవద్దని చట్టంలో లేదని పేర్కొంది. విలీనం చేస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అదనపు ఏజీ చెప్పగా.. తాము అలా డిమాండ్ చేయలేదని చర్చలకు సిద్ధమేనని కార్మిక సంఘాలు వివరించాయని తెలిపింది. చర్చల కోసం ఇరువర్గాలు చొరవ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వానికి బాధ్యత ఉంది
కార్మికుల డిమాండ్లలో చాలా వరకు ఆర్థిక భారం లేనివేనని.. అవి వారి జీవన ప్రమాణాలు, పని చేసే వాతావరణాన్ని మెరుగుపరిచేవేనని హైకోర్టు పేర్కొంది. మనది సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశమని ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించేలా.. సంక్షేమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కార్మికులు, వారి పిల్లల సంక్షేమం కూడా సర్కారు చూడాలని రాజ్యాంగం పేర్కొందని తెలిపింది. కార్మికుల అవసరాలతో పాటు ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులను చర్చలకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.
అధికార పరిధి తెలుసు
ఇరువర్గాలు మెట్టుదిగకపోతే.. రాష్ట్ర ప్రజల ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయని తాము గట్టిగా భావిస్తున్నామని తెలిపింది. యాజమాన్యానికి, కార్మికుల మధ్య విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పేర్కొంది. చర్చలు సఫలమయ్యాయని ఈనెల 28న ఇరువర్గాలు చెబుతాయని ఆశిస్తున్నామని ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది. తమ అధికార పరిధిపై పూర్తి స్పష్టత ఉందని హైకోర్టు పేర్కొంది. కార్మికుల డిమాండ్లు అంగీకరించాలని ఆదేశించే పరిస్థితి కోర్టుకు లేకపోవచ్చు కానీ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలకు వారి బాధ్యత గుర్తు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష