నిబంధనలు పాటించకుండా సచివాలయ భవనాలు కూల్చివేస్తున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. అన్ని అనుమతులు, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే కూల్చివేత పనులు ప్రారంభించినట్లు తెలిపింది.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు..
సచివాలయం కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ ప్రొఫెసర్ పీ.ఎల్. విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. వ్యాజ్యంలోని ఆరోపణలు తోసిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.
కోర్టుల జోక్యం వద్దు
ప్రస్తుత భవనాలను కూల్చి.. అక్కడే అద్భుతమైన సమీకృత సచివాలయం నిర్మించాలని గత నెల 30న మంత్రివర్గం తీర్మానం చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అనుమతులు పొందిన తర్వాతే ఆర్ అండ్ బీ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారని వివరించింది. కూల్చివేత వల్ల చుట్టుపక్కల ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని, వాయు కాలుష్యం తలెత్తుతోందన్న వాదనలు పూర్తి నిరాధారమని పేర్కొంది. కూల్చివేత వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపింది. పిటిషనర్లు రాజకీయ పార్టీలకు చెందిన వారని.. రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రోత్సహించవద్దని హైకోర్టును కోరింది. నూతన సచివాలయం నిర్మించాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. కోర్టులు జోక్యం చేసుకోవద్దని కోరింది.