జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా తీవ్రత, మూడోదశ విజృంభణపై ఊహాగానాల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు తెరిస్తే పిల్లల ప్రాణాలకే ముప్పని న్యాయవాది రవిచందర్ వాదించారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
అందరూ హాజరుకావాల్సిందేనా..?
మూడో దశ కరోనా ముంచుకొస్తోందని.. పిల్లలపై ప్రభావం ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నందున.. సహజంగానే తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని తరగతుల విద్యార్థులూ పాఠశాలలకు హాజరు కావల్సిందేనా...? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులందరూ కచ్చితంగా హాజరు కావల్సిన అవసరం లేదని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఆన్లైన్ బోధన కూడా కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
రెండు మూడు రోజుల్లో విధివిధానాలు..
చిన్న పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ధర్మాసనం అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకొని.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలకు ఖరారు చేయనున్నట్లు సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.