ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారు : హైకోర్టు - telangana high court hearing on covid pandemic
14:31 April 23
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
కరోనా నియంత్రణలో సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండో దశ వ్యాప్తి చెందిన తర్వాత మేల్కొంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై... విచారణ జరిపిన సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి ధర్మాసనం...సర్కారుపై ప్రశ్నలవర్షం కురిపించింది. రెండో దశ పొంచి ఉందని తెలిసినా ఎందుకు సిద్ధంగా లేరని అడిగింది.
కరోనా పరీక్షలు, నియంత్రణపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 21 వరకు 19లక్షల 64వేల పరీక్షలు చేశామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. 16 లక్షల 17వేల ర్యాపిడ్, 3లక్షల 47వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని వివరించింది. రాత్రిపూట కర్ఫ్యూ విధించి కట్టడికి కృషి చేస్తున్నామని తెలిపింది. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించింది.
థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్‌లపై ఆంక్షలేవని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలున్నపుడు... ఎన్నికలు అతీతమా అని...వాటికేందుకు ఆంక్షలు లేవని వివరణ కోరింది. కరోనాపై గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పగా...ఎన్నిసార్లు సమావేశం నిర్వహించి సలహాలిచ్చిందో చెప్పాలని హైకోర్టు అడిగింది. మరణాలపై ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
- ఇదీ చదవండి :రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి