Telangana High Court News: 'ప్రభుత్వ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేం' - ఉద్యోగుల కేటాయింపు
11:57 December 14
Telangana High Court News: 'ప్రభుత్వ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేం'
Telangana High Court news: ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై 226 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతి, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం కేటాయింపులు చేస్తోందన్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
Telangana Employees Allotment: ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Employees Allotment Issue: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ సహా రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీ పోస్టుల నియామక కమిటీలు ఏర్పాటు చేశారు. పాత జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు సైతం తీసుకున్నారు. నేడు ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.. అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల విభజన, కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.