కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
14:19 November 26
కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ
కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అవసరం ఉన్నప్పుడు 50 వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్రంగా ఆగ్రహించింది. ఫిర్యాదులు వస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది.
యశోద, కిమ్స్, కేర్, సన్‌షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీసింది. గ్రేటర్ ఫలితాలేమో కానీ ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెండో దశ కరోనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించట్లేదన్న హైకోర్టు... ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇవీ చూడండి: మతకల్లోలాలు సృష్టించే వారు ఎవరైనా వదలం: డీజీపీ