PG Medical Fee Hike: ప్రైవేట్ పీజీ వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫీజులు పెంచుతూ 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కొట్టేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.
రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఏక పక్షంగా ఫీజులు పెంచిందని పిటిషనర్లు వాదించారు. జీవోలు చట్టానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఫీజుల పెంపు జీవోలను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. టీఏఎఫ్ఆర్సీ 2016-19కి ఖరారు చేసిన ఫీజులనే తీసుకోవాలని కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది.