ర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. ఈ అంశం హోంశాఖ పరిధిలోనిది అంటూ కేంద్ర వ్యవసాయశాఖ, ఐచ్ఛికం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నాయని వ్యాఖ్యానించింది. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో తమకు సంబంధం లేదంటూ కేంద్రం దాఖలు చేసిన కౌంటరు బాధ్యతా రాహిత్యంగా ఉందని, వ్యవసాయశాఖ ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఈ నెల 8న వాదనలు వినిపించాలని, ఏ కారణంగానైనా గడువు కోరడానికి వీల్లేదని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదేం కౌంటర్..?
2020 అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన రైతులను జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాల ద్వారా ఆదుకునేలా ఆదేశించాలంటూ వి.కిరణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమైందని, సుమారు రూ.8,633 కోట్ల నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ దాఖలు చేసిన కౌంటరును పరిశీలించిన ధర్మాసనం ఇదేం కౌంటరని ప్రశ్నించింది. రైతులను ఆదుకోవడం, వారి సంక్షేమాన్ని చూడటం వ్యవసాయశాఖ బాధ్యతని పేర్కొంది. కరవు, వడగళ్లవాన, చలిగాలులకే సంబంధమని.. భారీ వర్షాలు, వరదలతో తమకు సంబంధం లేదని చెప్పడం తమాషాగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రతివాదిగా ఉన్న హోంశాఖ కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది.
గడువు కావాలని కోరడమేంటి?
ఈ దశలో సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు జోక్యం చేసుకుంటూ గడువు ఇస్తే హోంశాఖ వివరణ తీసుకుని కౌంటరు దాఖలు చేస్తామనగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను దాఖలు చేసి ఏడాది కావస్తున్నా ఇంకా గడువు కావాలని కోరడమేంటని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.రాధీవ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, గడువు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ కేసు గురించి శుక్రవారమే తెలిసినా ఏజీకి చెప్పకపోవడాన్ని ప్రశ్నించింది. 8న వాదనలు వినిపించాలని, ఏజీ మరో కోర్టులో ఉన్నారన్న స్వల్ప కారణాలతో వాయిదా కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
పంటలను నోటిఫై చేయలేదు: కేంద్రం
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చెల్లిస్తూ రైతులను ఆదుకుంటున్నామని కేంద్రం దాఖలు చేసిన కౌంటరులో పేర్కొంది. బీమా ఏజన్సీలను, పంటలను రాష్ట్ర ప్రభుత్వాలే నోటిఫై చేయాల్సి ఉందని.. తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరానికి పంటలను నోటిఫై చేయకపోవడంతో బీమా అందే అవకాశం లేదంది.
కౌలుదారులకు అందని సాయం
రైతు బంధు కింద ఏటా సాయం అందిస్తూ రైతులను ఆదుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్ తెలిపారు. ఈ పథకం ద్వారా సాయం పట్టాదారులకే దక్కుతుందని, పంట వేసిన రైతులందరికీ అందదన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 15 లక్షల మంది కౌలుదారులు ఉన్నారన్నారు. సొంత పెట్టుబడులతో పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు సాయం అందడం లేదన్నారు. విపత్తుల నిర్వహణ చట్టం కింద రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇతర పథకాలను చూపి సాయాన్ని ఎగవేయరాదని పేర్కొన్నారు.
ఇదీచూడండి:rain alert : హైదరాబాద్... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి