High Court On BJP MLA's: భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేతపై స్పీకరే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించాలని.. రేపు ఉదయం స్పీకర్‌ను కలవాలని భాజపా ఎమ్మెల్యేలకు ధర్మాసనం తెలిపింది. రాజకీయాలకు అతీతంగా శాసనసభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే వారూ సభలో ఉండాలని అభిప్రాయపడింది.
తుదినిర్ణయం శాసనసభ స్పీకర్‌దే..
భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై తుదినిర్ణయం శాసనసభ స్పీకర్దేనని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. సస్పెన్షన్‌పై స్టే ఇవ్వలేమని ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునివ్వవడంతో భాజపా ఎమ్మెల్యేలు.. ధర్మాసనం వద్ద అప్పీలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనాన్ని ఈ ఉదయం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు నోటీసులను తీసుకోవడం లేదని భాజపా ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్‌రెడ్డి తెలిపారు. తాజాగా నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అసెంబ్లీ కార్యదర్శికి అందచేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేస్తూ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందచేసినట్లు సాయంత్రం 4 గంటలకు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ హైకోర్టుకు తెలిపారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది హాజరు కాలేదు. సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా ఉందని భాజపా ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది వాదించారు. తమ పేర్లను ప్రస్తావించకుండానే మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.
అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు..
సస్పెన్షన్‌పై సభాపతికి అధికారాలు ఉంటాయని.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టులకు పరిమితంగా అధికారాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. అయితే రేపటితోనే సమావేశాలు ముగియనున్నందున.. భాజపా సభ్యులు స్పీకర్నే కలవాలని ధర్మాసనం సూచించింది. సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రేపు స్పీకర్‌ను కోరాలని భాజపా ఎమ్మెల్యేలకు తెలిపింది. సభ్యులను స్పీకర్‌కు కలిపించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సమస్య పరిష్కారానికి పార్టీలకు అతీతంగా సభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే వారూ ఉండాలంటూ.. భాజపా ఎమ్మెల్యేల అప్పీలుపై విచారణ ముగించింది.
ఇదీచూడండి:KTR On Students: ఆరు నెలలపాటు సినిమాలు కాస్త తక్కువగా చూడండి: కేటీఆర్