High Court on paddy Procurement: వానాకాలంలో వరి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న పిల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. న్యాయ విద్యార్థి శ్రీకర్ దాఖలుచేసిన పిల్‌పై సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ తుకారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ధాన్యం పాడైపోతోందన్న ఆందోళనతో... కనీస మద్దతు ధరకన్నా తక్కువకే ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఆందోళనతో ఇద్దరు రైతులు మరణించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని.. వానాకాలం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలకవ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన ఇతర రాష్ట్రాల రైతులకు 3 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని.. బహుశా దేశంలోనే మొదటి రాష్ట్ర ప్రభుత్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
AG On paddy Procurement: రాష్ట్రంలో 6,439 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వివరించారు. ఇప్పటికే 27 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి... నాలుగున్నర లక్షల రైతులకు 2,800 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు.. న్యాయస్థానం దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. పిటిషనర్ పేర్కొన్న ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. జనవరి 22 వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. ఏజీ వివరణను నమోదు చేసిన ధర్మాసనం.. ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీచూడండి:Mareddy on Paddy Procurement: 'ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెడుతోంది'