గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రుల్లో కొవిడ్ సహా ఇతర వైద్యసేవలు అందించాలని (telangana health minister harish rao review) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాధారణ వైద్య సేవల అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు కేంద్రంలో (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో హరీశ్‌రావు (telangana health minister harish rao review) సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కింగ్ కోఠి ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు పునరుద్ధరణ సహా టిమ్స్‌లో 200 పడకలు కొవిడ్ బాధితుల కోసం కేటాయించాలని, ఇతర వైద్య సేవలూ అందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.