రూ.వెయ్యిలోపు ఔషధాలతోనే కరోనా నుంచి కోలుకోవచ్చని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పరిస్థితి విషమించకముందే ఆస్పత్రికి వెళ్తే సురక్షితంగా బయటపడతారని స్పష్టం చేశారు.
తేలిగ్గా తీసుకోవద్దు..
అనారోగ్య లక్షణాలు కనపడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని హితవు పలికారు. కరోనాకు చికిత్స విషయంలో గ్రామీణ వైద్యులకూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సీనియర్ వైద్యులతో జిల్లాల్లోని వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. దగ్గు, జలుబు, చిన్నపాటి జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యవస్థపైనే దాడి చేస్తుందన్న ఈటల.. కొవిడ్‌కు అవసరమైన ఔషధాలన్నీ అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజన ఉండటం లేదని తెలిపారు. దశలవారీగా అన్ని వైద్య కళాశాలల్లో కరోనా రోగులకు బెడ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. 'హితం' అనే యాప్ ద్వారా విశ్రాంత వైద్యులు వైద్య సలహాలు ఇస్తున్నారని ఈటల తెలిపారు.
ప్రపంచమే భయపడింది..
మొదట్లో కరోనా కేసుల విషయంలో ఆందోళన ఉండేదని మంత్రి ఈటల అన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం మన వైద్యులకు ఉందని పేర్కొన్నారు. ఇంతకంటే భయంకరమైన వైరస్‌లు వచ్చినప్పటికీ ఇంతస్థాయిలో నష్టం జరగలేదని వివరించారు. కరోనాకు మనుషుల ప్రాణాలు తీసే శక్తి లేకపోయినప్పటికీ ప్రపంచం మొత్తం భయపడిందని పేర్కొన్నారు.
కరోనా లక్షణాలు లేకుండా రాపిడ్ కిట్లతో పరీక్షలు చేయించుకోవద్దు: ఈటల