ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకాడరని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా కష్టాలు గట్టెక్కించే ప్రయత్నంలో ఇది మరోసారి నిరూపితమైందన్నారు. సీఎం చొరవతో ఆక్సిజన్ సరఫరాకు సైనిక విమానాలు వినియోగిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఇది మొదటి ప్రయత్నమని మంత్రి వెల్లడించారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆక్సిజన్ సరఫరాకు సైనిక విమానాలు వినియోగిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలోనే ఇది మొదటి ప్రయత్నమని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం కేసీఆర్ వెనకాడరని స్పష్టం చేశారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు సీ-17 యుద్ధ విమానాల్లో ఎనిమిది ట్యాంకర్లను ఒడిశాకు పంపించామన్నారు. ట్యాంకర్ల ద్వారా 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఈనెల 27లోపు తీసుకువస్తామని ఈటల చెప్పారు. ఒడిశాలోని అంగుల్, రూర్కెలా స్టీల్ కర్మగారాల నుంచి ట్యాంకర్లు ఆక్సిజన్‌తో తిరిగి రహదారి మార్గాన రాష్ట్రానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. యుద్ధ విమానాల్లో ఖాళీ ట్యాంకర్లు పంపాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మూడు రోజుల విలువైన సమయం ఆదా అవుతోందని తెలిపారు.
ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవిగా భావించే ప్రభుత్వం... కరోనా సమయంలో ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ఈటల తెలిపారు. 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా లిక్విడ్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత రాలేదని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని ఈటల భరోసా ఇచ్చారు.
- ఇదీ చదవండి :భువనేశ్వర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్