Telangana Health Ministry : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఐదంచెల వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మూడంచెల వ్యవస్థ కొనసాగుతుండగా.. దీనికి అదనంగా కొత్తగా మరో రెండంచెలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సర్కారు వైద్య వ్యవస్థ అభివృద్ధి దిశగా ఇప్పటికే ప్రయాణం ప్రారంభమైందనీ, రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం కానుందని స్పష్టం చేసింది.
Health Department Report on Medical Progress : వ్యాధులను తొలిదశలో గుర్తించడం ద్వారా జబ్బు ముదిరిన తర్వాత చికిత్స అందించే పరిస్థితులను తప్పించవచ్చనీ.. అందుకే నివారణ దిశగా దృష్టిసారించిన ప్రభుత్వం పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల పేరిట కొత్త వైద్యవ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆరోగ్య శాఖ వివరించింది. ఇదే సమయంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవల కోసం కూడా ‘టిమ్స్’ రూపంలో ఐదో అంచెను కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ ఏర్పడ్డాకా వైద్య వ్యవస్థ ప్రగతి దిశగా పరుగులు పెడుతున్న తీరుపై ఆరోగ్యశాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది.