తెలంగాణ

telangana

ETV Bharat / city

Covid Treatment Medicine : 'కరోనా మందులకు కొరత రానీయొద్దు' - కరోనా చికిత్సకు ఔషధాలు

Medicine For Covid Third Wave : రాష్ట్రంలో కరోనా మూడో ముప్పు మొదలవ్వడంతో సర్కార్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది. చికిత్స అవసరమైన ఔషధాల కొరత లేకుండా తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

Covid Treatment Medicine
Covid Treatment Medicine

By

Published : Jan 8, 2022, 8:01 AM IST

Covid Treatment Medicine : కొవిడ్‌ మూడోదశ ముప్పు నేపథ్యంలో.. చికిత్సకు అవసరమైన ఔషధాలు తగినంతగా అందుబాటులో ఉంచే అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, బహిరంగ విపణిలో ఔషధ దుకాణాల వద్ద కూడా ఎటువంటి కొరత లేకుండా తగిన నిల్వలుండేలా చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. దీంతో రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అప్రమత్తమైంది. కొవిడ్‌ చికిత్సలో వినియోగించే ఔషధాలను ఉత్పత్తి చేసే సంస్థలు రాష్ట్రంలో ఏమేమీ ఉన్నాయని విచారించింది. ఆయా సంస్థల వద్ద ప్రస్తుత నిల్వలు.. మూడోదశ ఉద్ధృతిలో అవసరమయ్యేన్ని ఔషధాలను అదనంగా ఉత్పత్తి చేసుకోవడంపై వాటితో చర్చించింది.

లక్షణాలు లేకున్నా మందులు తప్పదా!

Medicine For Covid Treatment in Telangana : మూడోదశ ఉద్ధృతిలో ఎక్కువమందికి ఎలాంటి లక్షణాలు ఉండవని.. లేదా మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉంటాయని ఇప్పటికే నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో.. కేసులు భారీగా నమోదైతే.. ఇంటి వద్దనే విడి గదిలో చికిత్స పొందే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని ఔషధ నియంత్రణ సంస్థ అంచనా వేస్తోంది. ఆ పరిస్థితుల్లో అత్యధికులు మార్కెట్లో అవసరమైన మందులు కొనుక్కోవలసి వస్తుంది. అప్పుడు తగినన్ని ఔషధాలు అందుబాటులో లేకపోతే.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ముఖ్యమైన ఔషధాల నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది. కొవిడ్‌ చికిత్సలో ప్రధానంగా అజిథ్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌, పారాసెటమాల్‌, లెవోసెటిరిజైన్‌, రానిటిడైన్‌, విటమిన్‌ సి, మల్టీ విటమిన్‌, విటమిన్‌ డి మాత్రలను ఎక్కువగా వాడుతుంటారు. ఇంటి వద్ద చికిత్సకు ఇవే కీలకం. ఈ క్రమంలోనే ఆయా ఔషధ ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు. వచ్చే నాలుగు వారాల్లో అవసరాల మేరకు నిల్వలను సిద్ధం చేయడం తదితర అంశాలపై చర్చించారు.

బాధితులు 5 లక్షలకు చేరితే?

Covid Third Wave in Telangana : తెలంగాణలో పారాసెటమాల్‌ మాత్రలను 19 సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు సుమారు 15 కోట్ల మాత్రలు. అలాగే డాక్సిసైక్లిన్‌ మాత్రలను రాష్ట్రంలో 4 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి నెలా వీటి ఉత్పత్తి సామర్థ్యం 13 కోట్ల మాత్రల వరకూ ఉంటుందని అంచనా. రానున్న రోజుల్లో రోజుకు సుమారు 50 వేల మందికి కొవిడ్‌ సోకినా.. 10 రోజుల్లో 5 లక్షల మంది బాధితులు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ 5 లక్షలమందిలో సుమారు 4.5 లక్షలమంది ఇంటి వద్దనే చికిత్స పొందాల్సిన అవసరం ఉంటుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఇంత భారీ సంఖ్యలో బాధితులు నమోదైనప్పుడు.. అందుకు తగ్గట్లుగా ఔషధాలు కూడా సమకూర్చుకోవాల్సి వస్తుందని, అందుకే ముందస్తు నిల్వలపై దృష్టిసారించామని వైద్యవర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details