రాష్ట్రానికి వచ్చే నెల రెండో వారంలో కొవిడ్ టీకా అందుబాటులోకి రానుందనే అంచనాలతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా, దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు వీలుగా 10వేల టీకా కేంద్రాల్లో ప్రత్యేక కిట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్‌ను ఉంచనున్న క్రమంలో వాటిలో ఎలాంటి ఔషధాలు అవసరమో పేర్కొంటూ వైద్యఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో కిట్లను సిద్ధం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కు ఉత్తర్వులు జారీచేసింది. రూ.11.61 కోట్లతో ఈ ఔషధాలు, వస్తువుల కొనుగోలుకు అనుమతిచ్చింది.
కిట్‌లో 14 రకాల మందులు, వస్తువులు..
*కొవిడ్ టీకా కేంద్రంలోని కిట్‌లో 14 రకాల ఔషధాలు, సిరంజీలు, ఐవీ ద్రావణాలు, వైద్యపరికరాలు ఉంటాయి.
*టీకా ఇచ్చాక ఎవరిలోనైనా ఉన్నట్టుండి గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతే.. తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు ‘ఎడ్రినలిన్’ ఇంజక్షన్‌తో పాటు అలర్జీ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే వెంటనే ఇవ్వడానికి వీలుగా ‘హైడ్రోకార్డిసోన్ 100 ఎంజీ’ ఇంజక్షన్‌ను కిట్‌లో ఉంచుతారు.
*ఉన్నట్టుండి రక్తపోటు పడిపోతే తక్షణమే ‘రింగర్ లాక్టేట్ 500 ఎంఎల్’ ఐవీ ద్రావణాన్ని ఇస్తారు.