తెలంగాణ

telangana

ETV Bharat / city

Monkeypox in India : మంకీపాక్స్​ను గుర్తించడమెలా..? - Monkeypox cases in India

Monkeypox in India : భారత్​లోకి మంకీపాక్స్ ఎంట్రీ ఇచ్చింది. కేరళలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ వైరస్​ వ్యాప్తిని ఎలా గుర్తించాలి? ఎలా అరికట్టాలి? ఈ వ్యాధిని గుర్తించడమెలా? అనే దానిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Monkeypox
Monkeypox

By

Published : Jul 15, 2022, 7:34 PM IST

Updated : Jul 16, 2022, 12:23 PM IST

Monkeypox in India : దేశంలో మరో వైరస్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి 'మంకీపాక్స్​' సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలపడంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలని తక్షణం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. మంకీపాక్స్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులకు మంకీపాక్స్​కి సంబంధించిన లక్షణాలపై అవగాహన కల్పించటంతో పాటు... వివిధ రకాల నిర్ధరణ పరీక్షలు చేయడం, మంకీపాక్స్ కేసులను గుర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న, నిర్ధరణ అయిన బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించినట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా వచ్చే మంకీపాక్స్ లక్షణాలున్న బాధితుల శాంపిళ్లను పరీక్షించేందుకు హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రి సహా మొత్తం 15 వైరాలజీ ల్యాబ్​లకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

మంకీపాక్స్ గురించి:మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

గుర్తించడమెలా..శరీరంపై దద్దుర్లు రావడం మంకీపాక్స్‌ ప్రధాన లక్షణం. దీంతో పాటు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చంకల్లో, గజ్జల్లో లింఫుగ్రంధుల్లో వాపు, నీరసం, చలి, చెమట పట్టడం, గొంతునొప్పి, దగ్గు తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాలి. మంకీపాక్స్‌ అనుమానిత నమూనాలను పరీక్షించడానికి దేశం మొత్తమ్మీద 15 ప్రయోగశాలలకు అనుమతివ్వగా.. రాష్ట్రంలో గాంధీలోని ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. విదేశాల నుంచి వచ్చే వారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించాలని ఆదేశించారు. అయితే అనుమానితుల ప్రయాణ చరిత్రను తెలుసుకోవాలన్నారు.

వారిలోనే ఎక్కువ!..ఇదిలాఉంటే, గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్‌ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో నిర్ధారణ కాగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:భారత్​లో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​

Last Updated : Jul 16, 2022, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details