రాష్ట్ర స్వరూపం, ఆర్థికాంశాలు, వృద్ధిరేటు(telangana gsdp 2020-21) సహా వివిధ అంశాలకు సంబంధించిన సమాచారంతో అర్థ గణాంకశాఖ ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొచ్చింది. 'తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్- 2021(telangana state at a glance 2021)'ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించి సమగ్ర సమాచారంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. 2020-21 రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 2019-20 జీఎస్డీపీతో పోలిస్తే 2.4శాతం వృద్ధిరేటు ఉన్నట్లు పేర్కొన్నారు. 2012-13 నుంచి ఇంత తక్కువ వృద్ధిరేటు నమోదు కావడం ఇదే ప్రథమం. కరోనా ప్రభావం కారణంగా గడచిన ఏడాది వృద్ధిరేటు తక్కువగా నమోదైంది. ఇదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు మైనస్ మూడు శాతానికి పడిపోయింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 వేలు కాగా... పెరుగుదల స్వల్పంగా కేవలం 1.8 శాతం మాత్రమే ఉంది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం సగటు నాలుగు శాతం తగ్గింది.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి...
2019-20తో పోలిస్తే 2020-21లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా దాదాపు మూడు శాతం మేర పెరిగింది. తయారీ, రవాణా, వ్యాపారం, హోటళ్లు, స్థిరాస్థిరంగం వాటా స్వల్పంగా తగ్గింది. 2020-21లో రాష్ట్రంలో మొత్తం 184 లక్షలకుపైగా ఎకరాల భూమి సాగైంది. 113 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. రెండు సీజన్లలో కలిపి కోటికిపైగా ఎకరాల్లో వరి సాగైంది. 2019లో రాష్ట్రంలో పశుసంపద జనాభా మూడు కోట్లా 26 లక్షలు. ఇందులో గొర్రెల సంఖ్య కోటీ 90 లక్షలకుపైగా ఉంది. 2020-21లో రాష్ట్రంలో 29వేల కోట్లకుపైగా విలువైన ఖనిజాలు ఉత్పత్తి అయ్యాయి. 2020-21లో రాష్ట్రంలో 57 వేల 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో మొత్తం రహదార్ల విస్తీర్ణం 97 వేల 583 కిలోమీటర్లు. రైల్వే పొడవు 1822 కిలోమీటర్లు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల 996 పడకలు అందుబాటులో ఉన్నాయి.