వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేసింది. అనధికారిక, క్రమబద్ధీకరణ కాని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. దీనితో క్షేత్రస్థాయిలో ఆందోళన నెలకొంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ను ముడిపెట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. ప్రజల ఇక్కట్లు, వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
17:25 December 29
ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి
ఇంతకుముందు చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న ఓపెన్ ప్లాట్లు, నిర్మాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్లు అయిన ప్లాట్లు, భవనాలు, వ్యవసాయేతర ఆస్తుల తదుపరి రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే అనధికారిక, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సంబంధిత అధికారి నుంచి అనుమతులు ఉంటేనే కొత్త ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.
వాటికి ఇబ్బందులు లేవు
అధికారిక, అనుమతులున్న, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లు... బీపీఎస్, బీఆర్ఎస్ ఉన్న భవనాలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి :"కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల